
NTR Vijayawada:పెనుగంచిప్రోలు: నవంబర్ 13:-పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు తీసుకునేందుకు వెళ్లిన భక్తులు కౌంటర్ల వద్ద తాళాలు వేసి ఉండటంతో నిరాశ చెందుతున్నారు.శుక్రవారం, ఆదివారం మినహా మిగతా రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆలయంలో దర్శనాలకు బ్రేక్ సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆలయ తలుపులు మూసివేస్తారు. దూర ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో వచ్చే భక్తులు ఆ సమయానికి చేరుకోగానే హడావుడిగా దర్శనం పూర్తి చేసుకుంటారు. కానీ బయటకు వచ్చి ప్రసాదాల కౌంటర్ల దగ్గరకు వెళ్తే అవి కూడా మూసివేసి ఉండటం భక్తులను నిరాశకు గురిచేస్తోంది.

వారిని ప్రశ్నిస్తే ఆలయ సిబ్బంది “మధ్యాహ్నం బ్రేక్ సమయములో ప్రసాదాల విక్రయాలు కూడా నిలిపివేస్తాం, ఆలయం బయట సమాచార కేంద్రం వద్ద పొందవచ్చు” అని సూచిస్తున్నారు. అయితే అక్కడకెళ్లినా అదే సమయపాలన వర్తిస్తుందని చెప్పడంతో భక్తులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.ప్రసాదాల విక్రయ కౌంటర్లు మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి తిరిగి ప్రారంభించే రికార్డులు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శనం అయ్యాక కూడా ప్రసాదం దొరకక భక్తులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు.“దర్శన సమయానికి బ్రేక్ పెట్టడం సబబే కానీ ప్రసాదాల విక్రయాలకు కూడా సమయపాలన అవసరమా?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ముందుగానే ఆలయం వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి సమాచారం ఇవ్వకపోవడం పలు విమర్శలకు కారణమవుతోంది.ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి, ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు నిరంతర ప్రసాదాల విక్రయాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.







