
జగ్గయ్యపేట/పెనుగంచిప్రోలు, నవంబర్ 5:-రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం పేదల భవిష్యత్తుపై దాడి చేసినట్టేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. బుధవారం పెనుగంచిప్రోలు గ్రామంలోని డౌన్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, “మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. అందులో 7 పూర్తయ్యాయి, మరిన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గం. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర” అని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో లక్షల కోట్ల ఆదాయం వచ్చే మెడికల్ సంస్థలను తన బంధువులు, పార్టీ అనుచరులకు అందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. “ప్రభుత్వం నిర్వహించాల్సిన విద్యా సంస్థలు ప్రైవేట్ చేతుల్లోకి వెళితే పేదలకు వైద్యం కూడా అందనిదైపోతుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనరాజు మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు నిరసనగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తిప్పే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ మార్కపూడి గాంధీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు కీసర లోకేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు పోన్నం కోటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి, వూట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి తదితరులు పాల్గొన్నారు.నాయకులు ముందుగా దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.







