GUNTUR NEWS: నల్లపాడు చెరువుని పూడికతీయించి, సమగ్రాభివృద్ధికి చర్యలు
DEVELOPMENT IN GUNTUR
గుంటూరు నగరపాలక సంస్థ పరధిలోని 93 ఎకరాల నల్లపాడు చెరువుని పూడికతీయించి, సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇరిగేషన్, రెవెన్యూ, జిఎంసి అధికారులతో కలిసి నల్లపాడు చెరువుని తనిఖీ చేసి, మ్యాప్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ 27వ డివిజన్లోని నల్లపాడు చెరువులో 93 ఎకరాలను 30-40 ఏళ్లుగా పూడికలు తీయకపోవడం వల్ల చెరువు పూడుకు పోయిందన్నారు. డివిజన్ కార్పొరేటర్, ప్రజలు తమకు చెరువు అభివృద్ధి చేయాలని పలుమార్లు తమ దృష్టికి తెచ్చారన్నారు. డ్రైనేజ్ సమస్యలు, భూములు ఆక్రమించిన వెంచర్ల సమస్యలు కూడా ఉన్నాయన్నారు. పూడికలను ప్రభుత్వం తరుపున కాంట్రాక్ట్ ఇచ్చి, తీయించడం ద్వారా రూ.10-12 కోట్లు నిధులు సమకూరే అవకాశం ఉందని, సదరు నిధుల ద్వారా వాకింగ్ ట్రాక్, ప్లేగ్రౌండ్, చెరువులో నీటి నిల్వ పెంచడం చేస్తామన్నారు.త్వరలో చెరువుని అభివృద్ధి చేసి, స్థానిక సమస్యలు తీర్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రత్తిపాడు శాసన సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గుంటూరు నగరపాలక సంస్థలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులపై దృష్టి సారించామని, ఇక నుండి ఆయా ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల అభివృద్ధిలో భాగంగా వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేలా కృషి చేస్తామన్నారు. నల్లపాడు చెరువులో షుమారు 4.5 ఎకరాలు దళితులు సాగు చేసుకుంటున్నారని, ముందుగా సర్వే చేపట్టిన తర్వాత వారి జీవనోపాధికి భంగం కల్గకుండా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.