
ఎన్.టి.ఆర్:విజయవాడ:23-10-25:-దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగానికి గౌరవంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం”ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర గౌరవనీయ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా విద్యార్థులకు పోలీస్ శాఖలో జరుగుతున్న విధులు, ఆధునిక సాంకేతిక పద్ధతులు, సైబర్ నేరాల నిరోధం, ఆయుధాల వినియోగం, వైర్‌లెస్ సెట్‌ల వినియోగ విధానం, ఫిర్యాదుల స్వీకరణ విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

పోలీసు అధికారులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే దినచర్యలు, రికార్డుల నిర్వహణ, ప్రజలతో వ్యవహరించే తీరును వివరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ముందుకు సాగుతున్న విధానాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు.పోలీస్ అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి, సేవా మనసు పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.







