
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా బాపట్ల పోలీసులు దూకుడు పెంచారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ కాలనీలో పోలీసులు భారీ ఎత్తున ‘మెగా కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలతో స్థానిక అసాంఘిక శక్తులు ఉలిక్కిపడ్డాయి.
నిర్బంధ సోదాలు.. 26 వాహనాల సీజ్
చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ పర్యవేక్షణలో, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.వి. రమణయ్య నేతృత్వంలో సుమారు 45 మంది పోలీసు సిబ్బంది మరియు ప్రత్యేక ‘ఈగల్ టీం’ ఈ సోదాల్లో పాల్గొన్నారు. బండ కాలనీలోని ప్రతి ఇంటిని, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
“యువత తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసంగే లేదు,” అని ఆయన హెచ్చరించారు.
bapatla newsవాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలని, లేనిపక్షంలో వాటిని అనుమానిత వాహనాలుగా పరిగణించి సీజ్ చేస్తామని తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి: సమాచారం ఇస్తే గోప్యత
జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అసాంఘిక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక ఎస్హెచ్ఓకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
పాల్గొన్న అధికారులు: ఈ మెగా సెర్చ్ ఆపరేషన్లో ఇంకొల్లు ఎస్.ఐ జి. సురేష్, కారంచేడు ఎస్.ఐ షేక్ ఖాదర్ బాషా, చిన్నగంజాం ఎస్.ఐ ఎస్. రమేష్, ఈగల్ బృందం మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







