
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్మితమవుతున్న నూతన పోలీస్ శిక్షణకేంద్రం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను స్థానిక ఎమ్మెల్యే రాము మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో హాజరైన మంత్రులు కొల్లు రవీంద్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము హోం మంత్రిని కలిసి తమ నియోజకవర్గంలోని గుడివాడ పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ మరియు టిడ్కో కాలనీల అభివృద్ధిపై వివరాలు అందజేశారు. ప్రస్తుతం ఈ కాలనీల్లో నివాసముంటున్న కుటుంబాల సంఖ్యతో పాటు రానున్న రోజుల్లో పెరిగే జనాభా సంఖ్యపై వివరాలు తెలియజేశారు.
ఈ రెండు కాలనీల పరిధిలో ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, భద్రతా పరంగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అదే ఉద్దేశంతో అక్కడ మూడు పోలీస్ స్టేషన్ల అవసరం తలెత్తే అవకాశముందని ఎమ్మెల్యే రాము హోంమంత్రి అనితకు వివరించారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హోం మంత్రి అనిత, ప్రభుత్వం ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని, నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు.
అనంతరం శిక్షణకేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు కలసి నిర్వహించారు. పోలీస్ శాఖలో నూతనతరం కానిస్టేబుళ్లు, సిబ్బందికి తగిన శిక్షణను అందించేందుకు ఈ కేంద్రం నిర్మించబడనుంది.
ఈ శిక్షణ కేంద్రం పూర్తయిన తర్వాత కృష్ణా జిల్లా పోలీస్ వ్యవస్థ మరింత సమర్థంగా సేవలందించగలదని అధికారులు అభిప్రాయపడ్డారు.







