గుంటూరు, అక్టోబరు 8:పొన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (సి.హెచ్.సి)కి అవసరమైన అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శించి, పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. తన పర్యటనలో ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని గుర్తించి, వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. దాంతో బుధవారం నాటికే కొత్త అంబులెన్స్ సి.హెచ్.సి.కి చేరింది.
ఆకస్మిక తనిఖీ సందర్భంగా కలెక్టర్ పారిశుధ్యం, మెరుగైన వైద్య సేవలపై దృష్టి పెట్టారు. చికిత్స పొందుతున్న రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి అందుతున్న సేవలపై సమాచారం సేకరించారు. మందుల సరఫరా, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను వివరంగా పరిశీలించారు.
అవసరమైన అన్ని ఔషధాలను అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రిలో ఉత్తమమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చే ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్న సూచనలూ ఇచ్చారు.
ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ పర్యటనతో ఆసుపత్రిలో సేవల ప్రాముఖ్యతపై మరింత అవగాహన ఏర్పడిందని అధికారులు తెలిపారు.