
ఏలూరు, అక్టోబర్ 15:రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యలో నెలకొన్న అనేక సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికై విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించేందుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్రను చేపట్టింది. ఈ యాత్రను విజయవంతం చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక స్పూర్తి భవన్‌లో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం స్థానిక స్పూర్తి భవన్‌లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 4,500 ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని, ప్రతి మండలానికి కనీసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.పెండింగ్‌లో ఉన్న రూ. 6,400 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందలేక విద్యాభవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పి3) మాదిరిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల భూములను కార్పొరేట్లకు అద్దెకు ఇవ్వాలన్న ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
ఈ సందర్భంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి. శివకుమార్ మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను కార్పొరేటీకరణ దిశగా తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ముఖ్యంగా ఏలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతి గదులలేక విద్యార్థులు చెట్లకింద చదువుకుంటున్న దుస్థితి నేటికీ కొనసాగుతోందని, వెంటనే తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేగాక, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 30న బస్సు యాత్ర ఏలూరు నగరానికి రానున్నందున విద్యార్థి సముదాయం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విద్య పరిరక్షణకు తమ మద్దతును చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్ధు, సంతోష్, గోపికృష్ణ, నాని, సన్నీ, రాజ్ కుమార్, కృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.







