
విశాఖపట్నం, మార్చి 23 (ప్రజా ప్రతినిధి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ద్వారా వచ్చే వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యంగా డీఎంహెచ్ఓ (DM&HO) మరియు అటవీ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని ఆదేశించారు. పద్మనాభం మండల ఎంఆర్ఓ పరిధిలోని సమస్యలను త్వరితగతిన ముగించాలని సూచించారు. మున్సిపల్ విభాగంలో పనితీరు మెరుగుపడినప్పటికీ, కొన్ని జోన్లలో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా డీఈఈ జోన్-1 లోని లోపాలను సరిదిద్దాలని, ఏసీపీ జోన్-1, జోన్-4 పరిధిలోని అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెరుగుదల కనబరచాలని ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. 21 రోజుల గడువు దాటినా ఫిర్యాదుకు పరిష్కారం చూపని ఆనందపురం మండల సర్వేయర్‌కు నోటీసులు ఇవ్వాలని, అలాగే మూడుసార్లు కంటే ఎక్కువ తప్పిదాలు చేసిన అధికారులకు వెంటనే ‘చార్జ్ మెమోలు’ జారీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, హౌసింగ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే పీజీఆర్ఎస్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.http://VISHAKAPATNAM NEWS







