
బాపట్ల:28-11-25:- కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అన్ని మండల తహసిల్దారులతో వీక్షణ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేనివిధంగా ప్రతి అర్జీని వెంటనే పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. పింఛన్ పంపిణీపై చర్చిస్తూ డిసెంబర్ 1వ తేదీన శాతం నూరు పిండంగా నగదు పంపిణీ జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్యాంకుల నుంచి అవసరమైన మొత్తాన్ని ముందుగానే డ్రా చేసి సిబ్బందికి అందించాలని చెప్పారు. తుపాను హెచ్చరిక దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గత నెలలో మిగిలిన నగదును వెంటనే చెల్లించాలని ఆదేశించారు. లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మిగిలిన మొత్తాన్ని వెంటనే డిపాజిట్ చేయాలని సూచించారు.

అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలు బాపట్ల జిల్లా నుంచి విడిపోతున్న విషయాన్ని డీఆర్‌ఓ జి. గంగాధర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గజిట్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచి ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే వచ్చిన అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా అధికారులు మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.







