
హైదరాబాద్:13-10-25:-తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త నేత ప్రవేశించారు. రిటైర్డ్ ఐఐఎస్ అధికారి కూనపరెడ్డి హరిప్రసాద్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజకీయాల్లో పాతవారు వెళ్లి, కొత్త నాయకులు రావాల్సిన అవసరం ఉంది. అవినీతిరహిత, ప్రజల మద్దతుతో నడిచే పరిపాలన కోసం ప్రజారాజ్యం పార్టీకి చేరాను,” అని తెలిపారు.పార్టీ విధివిధానాలు తనకు నచ్చాయని పేర్కొన్న ఆయన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తతరం నాయకులను పరిచయం చేస్తామన్నారు. గ్రామస్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకుని, పార్టీ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.కొత్తతరం రాజకీయాలకు నాంది పలికిన ప్రజారాజ్యం పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.







