
అమరావతి, అక్టోబర్ 31:-ప్రపంచ పర్యాటక యవనికపై ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం దూసుకుపోతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నవంబర్ 4 నుండి 6 వరకు లండన్‌లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 ప్రదర్శనలో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నవంబర్ 2వ తేదీన లండన్ పర్యటనకు బయలుదేరనున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని చెప్పారు. “డబ్ల్యూటీఎం వేదికగా ఆంధ్రప్రదేశ్ స్టాల్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించబోతున్నాం” అని మంత్రి దుర్గేష్ వివరించారు.
లండన్ పర్యటనలో భాగంగా 30 మంది విదేశీ ప్రతినిధులతో చర్చలు జరిపి, పలు దేశాల్లో పర్యాటక రంగం అభివృద్ధి విధానాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. “ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే మా లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పారు.పర్యాటక రంగాన్ని విశ్వవ్యాప్తం చేయడం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి తెలిపారు. “దీంతోపాటు స్థానిక స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి” అని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.







