
గుంటూరు:-ప్రతిపాడు నియోజకవర్గంలోని బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (DIET) ఆఫ్ ఎక్సలెన్స్ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారితో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి రంగంలో నాణ్యమైన వ్యవస్థలు అవసరమని, ముఖ్యంగా విద్యారంగంలో ఉపాధ్యాయులకు నిరంతర, ఆధునిక శిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్న ‘సమగ్ర శిక్ష’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు డైట్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ మంజూరైనట్లు తెలిపారు. గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో సెంటర్‌కు రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు ఆమోదం పొందాయని వివరించారు.

గుంటూరులో నిర్మించనున్న డైట్ సెంటర్ సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 నుంచి 4 భవనాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధాన శిక్షణ భవనం, హాస్టల్, సిబ్బంది క్వార్టర్స్‌తో పాటు ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, నెక్స్ట్ జనరేషన్ శిక్షణ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు హాస్టల్ సదుపాయంతో ఇక్కడ శిక్షణ పొందేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని, ఇది నిరంతర శిక్షణ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఈ డైట్ సెంటర్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు.

నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, కనీసం వంద సంవత్సరాలు నిలిచేలా నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.Guntur local news
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










