హైదరాబాద్, సెప్టెంబర్ 22:ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 11వ ఎడిషన్ NSL Luxe తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ మైదానంలో ప్రారంభంకానుంది. కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఈ మెగా ఈవెంట్‌కు దేశ విదేశాల నుండి 123 మంది ప్రముఖ గోల్ఫర్లు హాజరవుతున్నారు.
ఈ టోర్నీలో భారత్‌కు చెందిన అగ్రశ్రేణి గోల్ఫర్లు పాల్గొనుండగా, చెక్ రిపబ్లిక్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్, ఉగాండా వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ వేదికగా జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో మొహమ్మద్ అజార్, విశేష్ శర్మ లాంటి స్థానిక ప్రొఫెషనల్స్‌తో పాటు, పలు స్థానిక అమెచ్యూర్ గోల్ఫర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించనున్నారు.
ఈ ఈవెంట్‌కు NSL Luxe ప్రాయోజకంగా, తెలంగాణ టూరిజం భాగస్వామిగా ఉన్నారు. ఆతిథ్య నిర్వహణను హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ భుజాన వేసుకుంది. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేయనుండటంతో, గోల్ఫ్ అభిమానులు అట్టహాసంగా ఆస్వాదించనున్నారు.