
పెనుగంచిప్రోలు, అక్టోబర్ 31:మోంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య హామీ ఇచ్చారు.పెనుగంచిప్రోలు గ్రామ పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులను ఆయన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మోంథా తుఫాన్ తీవ్రతతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఎకరా నష్టాన్ని అధికారులు ఎమ్మార్వో సమక్షంలో గుర్తించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటుంది” అని తెలిపారు.
పెనుగంచిప్రోలు నుండి ముచ్చింతాల వరకు రహదారి వరదలతో దెబ్బతిన్న నేపథ్యంలో, ముచ్చింతాల గ్రామంలోని స్థానిక నాయకులు స్వయంగా మట్టిని తోలించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, ఎమ్మార్వో, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.







