
బాపట్ల:డిసెంబర్ 17:-ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమే ఏసుక్రీస్తు అని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జి. గంగాధర్ గౌడ్ అన్నారు. బాపట్ల కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ప్రీ–క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి ఉద్యోగులతో కలిసి వేడుకలు జరిపారు. క్రిస్మస్ పండుగ ఆనందం ప్రతి ఒక్కరి జీవితంలో వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

అందరితో సమాధానంగా జీవించాల్సిన అవసరం ఉందని డీఆర్‌ఓ తెలిపారు. కుల, మత భేదాలను పక్కనబెట్టి సోదరభావంతో మెలగాలని సూచించారు. “నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడమే నిజమైన సమానత్వం” అని పేర్కొంటూ, మంచి మనసుతో ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
కలెక్టరేట్ ఏవో మల్లికార్జున రావు మాట్లాడుతూ, ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయమన్నారు. ఆయన ప్రేమను అందరికీ పంచారని, అదే విధంగా బేధాభిప్రాయాలు లేకుండా సమానత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.

జిల్లా సమాచార సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకట్రామణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని, ఉద్యోగులంతా సమానత్వాన్ని పాటించాలని అన్నారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







