BAPATLA NEWS: ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కరం చూపించండి..
ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కరం చూపించండి..
బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు..
జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ప్రజా ప్రతినిధులు ఇచ్చిన విన్నపాలు పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం భూములను గుర్తించి ఫిబ్రవరి28 నాటికి నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం ఇచ్చి వినియోగంలో లేని భూములను తిరిగి తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో స్మశాన భూములకు అవసరమైన భూములను పరిశీలించి ప్రభత్వానికి ప్రతిపాదనలు పంపడానికి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రు లకు అవసరమైన భూములు పరి శీలించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో సాగునీటి కాలువల మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో త్రాగునీటి పధకాల మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల మండలంలో ఎత్తిపోతల పధకం ద్వారా 4వేల500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.చీరాల కుందేరు కాలువ ఆక్రమణలు పరిశీలించాలని రెవెన్యూ,డ్రైనేజీలు అధికారులను ఆదేశించారు. మోటుపల్లి వీరభద్ర స్వామి ఆయాల యాన్ని అభివృద్ధి చేయడానికి పరిశీలించాలని దేవాదాయ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.జాతీయ రహదారుల భూసేకరణలో నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు చెప్పారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్,జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమా, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.