పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని వివి నగర్ మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ వేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని, పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కార్మికులతో పాటు పలువురు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న IFTU ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన విద్యుత్ చట్టాలు రైతులపై భారం మోపుతున్నాయని, వ్యవసాయ మోటర్లపై మీటర్లు బిగించడం ద్వారా ఆర్థిక దోపిడీ జరగుతుందన్నారు. దీంతో పాటు AITUC జిల్లా అధ్యక్షుడు రెడ్డి డాంగే, CITU నాయకుడు పంపన రవికుమార్, CPM జిల్లా కార్యదర్శి ఏ.రవి తదితరులు మాట్లాడారు.
వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదానీ గ్రూపుతో చర్చలు జరిపి స్మార్ట్ మీటర్లు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అదే తరహాలో ఏపీలో బాబు సర్కార్ కూడా వర్తక రంగాల్లో స్మార్ట్ మీటర్లను అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.
వారు స్మార్ట్ మీటర్ల ద్వారానే అధిక చార్జీల వసూలు జరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాల్లో వదిలేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఎన్నికల అనంతరం మారిపోతున్నాయని, ప్రజలను దారితప్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమం ముగింపు ప్రసంగంలో IFTU నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు ఉన్న చోట ట్రూ ఆఫ్ చార్జీల పేరిట ప్రజలపై అదనంగా భారం మోపుతున్నారని, ఇది ప్రజా దోపిడీకి మారుద్దిగా మారుతోందని పేర్కొన్నారు. అందుకే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వసూలు చేసిన అదనపు చార్జీలను ప్రజల బ్యాంక్ ఖాతాల్లో తిరిగి జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మీసాల రమణ, కోరాడ అప్పారావు, ధనను విజయ్, పద్మ సింహాచలం, సూరిబాబు, నాయుడు, భాస్కర్, సీమమ్మ, సరోజిని, రాములమ్మ, దుర్గారావు, పుప్పాల కనబాబు, అడ్డగర్ల లక్ష్మి ఇందిరా, యువ భవాని, ఐద్వా నాయకురాలు అరుణకుమారి, ఎం.ఇస్సాకు, ఎస్.సత్యనారాయణ, జి.కోటేశ్వరరావు, సూరిబాబు, త్రినాధ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేపు 5వ తేదీన జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద జరుగబోయే ధర్నా కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని నాయకులు పిలుపునిచ్చారు.