
మంగళగిరి: నవంబర్ 14:-58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవ వేడుకలు మంగళగిరి రాజీవ్ సెంటర్‌లోని గుర్రం జాషువా భవనంలో శుక్రవారం సంబర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సి.కే. జూనియర్ కళాశాల లెక్చరర్ డాక్టర్ ఎన్. ఆనందరావు నెహ్రూ, అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. ఆనందరావు, “పుస్తకాలే శక్తి… బాలలే రేపటి భవిష్యత్తు శిల్పులు” అని పేర్కొన్నారు. నేటి చిన్నారుల విజన్, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రధాన శక్తి అని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చెప్పినట్లుగా దేశ అభివృద్ధికి శాస్త్రీయ దృక్పథం కీలకమని గుర్తుచేశారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ విద్య–ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్ర ప్రగతికి సైంటిఫిక్ టెంపర్ అవసరమని అనేక వేదికల్లో స్పష్టంచేశారని తెలిపారు.కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, గ్రంథాలయ ఉద్యోగులు, పాఠకులు పాల్గొన్నారు.







