
వైఎస్సార్ కడప జిల్లా: బి.మఠం:25-11-25:-సోషల్ మీడియా వేదికగా గత నాలుగేళ్లుగా తనపై జరుగుతున్న అసభ్య, అమానవీయమైన ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని గురుపత్ని మారుతి మహాలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు హోమ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, గవర్నర్‌కు వినతులు సమర్పించినట్లు ఆమె తెలిపారు.వెంకటాద్రి స్వామి, దత్తాత్రేయ స్వామి, PPN ప్రసాద్, వెంకటాద్రి స్వామి మేనమామ పర్లకొండ చంద్రశేఖర్, సన్నబోయిన శ్రీనివాస్, పొన్నేకంటి శ్రీనివాసచారి లు తనపై అసభ్యంగా, జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే ఈ విషయమై జిల్లా SPకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“గత నాలుగేళ్లుగా మానసికంగా వేధింపులకు గురవుతున్నాను. 2024 మార్చిలో SPకి ఫిర్యాదు చేసాను. స్పందన లేకపోవడంతో కలెక్టర్, DIG, అదనపు DGP, DGPలకు కూడా పంపాను. ఫలితం లేకపోయింది” అని మారుతి మహాలక్ష్మి తెలిపారు.2024 నవంబర్ 8, 9 తేదీల్లో మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్న హోమ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసి ధైర్యం వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే 11.11.2024న ఇద్దరికీ ఫిర్యాదు చేయగా, అది మళ్లీ SP కార్యాలయానికి మార్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.తాజాగా 11.11.2025న ప్రత్యర్థులు మరోసారి అదే అసభ్య ప్రచారం చేసినట్లు పేర్కొంటూ, 13.11.2025న SPకి మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.“నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ మానసిక వేదన కన్నా చావడం మేలు. నన్ను ఒకేసారి రాళ్లతో కొట్టి చంపేందుకు నిందితులకు అనుమతి ఇవ్వాలి. కొట్టే వారికి భద్రతా ఏర్పాటు కూడా చేయాలి” అని విన్నపం చేసానని మారుతి మహాలక్ష్మి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా తెలియజేశానని వెల్లడించారు.







