
వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటిలోపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురవవచ్చు.
అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు.అదనంగా, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.”







