
హైదరాబాద్:30-11-25:-రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సివిల్ సప్లయ్ శాఖ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 మంది రైస్ మిల్లర్లకు, వనపర్తి జిల్లాలో 36 మంది మిల్లర్లకు సీఎంఆర్ కేటాయించకుండా అధికారులు అనవసర ఇబ్బందులు పెడుతున్నారని యుగంధర్ గౌడ్ ఆరోపించారు. గతంలో కెపాసిటీకి మించి కేటాయింపులు చేసినప్పటికీ, ఆలస్యమైనా మొత్తం సీఎంఆర్ అప్పగించారని, అయితే ఇప్పుడు ఢిఫాల్టులు ఎందుకు పెడుతున్నారో అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు.
సీఎంఆర్ అందించిన రెండేళ్ల తర్వాత 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ విధించడం ఏ న్యాయమని ప్రశ్నించారు. అప్పుడే పెనాల్టీ వేయకుండా రెండు సంవత్సరాలు గడిచాక జరిమానాలు విధించి, వడ్డీతో కలిసి చెల్లించాలని ఒత్తిడి చేయడం అభాసుపాలమని వ్యాఖ్యానించారు.“సీఎంఆర్ ఇవ్వకపోతే ఢిఫాల్ట్ పెట్టండి… కానీ ఇచ్చిన తర్వాత ఢిఫాల్ట్ పెట్టడం అన్యాయం” అని యుగంధర్ గౌడ్ అన్నారు. ముందుగా ధాన్యం ఇస్తామని చెప్పి, బ్యాంకు గ్యారంటీలు తీసుకుని తర్వాత కేటాయింపులు ఆపేయడంలో దాగిన ఉద్దేశం ఏమిటో అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యపై త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలను కలిసి నివేదిస్తామని వెల్లడించారు.







