
Krishna :గుడివాడ రూరల్:29-11-25:- మండలం దొండపాడు గ్రామంలో రైతుల కోసం నిర్వహించిన ‘రైతన్నా… మీకోసం’ కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి దొండపాడు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ సూత్రాలు– నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు–పై రైతులకు ఎమ్మెల్యే రాము వివరంగా అవగాహన కల్పించారు. పంటల లాభదాయకత పెంచడం, వ్యవసాయాన్ని స్థిరమైన ఆదాయం వచ్చే రంగంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం గణనీయంగా దెబ్బతిన్నదని, రైతులకు ఎదురైన ఇబ్బందులను ప్రభుత్వ నిర్లక్ష్యమే పెంచిందని రాము విమర్శించారు. కొత్త ప్రభుత్వం చేపట్టిన పంచసూత్రాలు వ్యవసాయ పునర్నిర్మాణానికి బాటలు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమానికి హాజరైన రైతులకు ‘రైతన్న సేవలో – మన మంచి ప్రభుత్వం’ పత్రికలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం రైతుల ప్రయోజనం కోసం 30 క్వింటాళ్ల మినుము విత్తనాలను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్‌యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నేతలు చేకూరు జగన్మోహనరావు, బ్యాంక్ చైర్మన్ ముసునూరి రాజేంద్రప్రసాద్, ముత్తినేని అమరబాబు, లింగంనేని వీరబసవయ్య మరియు పలువురు నేతలు పాల్గొన్నారు. MPDO విష్ణు ప్రసాద్, ADA కవిత, AO అనంతలక్ష్మి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ సౌజన్య తదితర అధికారులు కూడా హాజరయ్యారు.







