
ఎన్టీఆర్ జిల్లా:జగ్గయ్యపేట:04-11-25:-పట్టణంలోని సాయి తిరుమల కోల్డ్‌స్టోరేజ్‌లో సుమారు ఏడు నెలల క్రితం సంభవించిన అగ్నిప్రమాదంలో మిర్చి, అపరాలు పూర్తిగా కాలిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో కోల్డ్‌స్టోరేజ్ భవనం కూడా పూర్తిగా ధ్వంసమైంది.మొత్తం 207 మంది రైతులు నష్టపోయిన ఈ ఘటనలో వారికి న్యాయం చేయించేందుకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కీలక పాత్ర పోషించారు. ఆయన నిరంతర కృషి, పట్టుదలతో కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నుంచి మొత్తం రూ.10.5 కోట్లు నష్టపరిహారంగా రైతులకు చెల్లింపులు జరిగాయి.
ఇన్సూరెన్స్ రిన్యువల్ చేయని పరిస్థితుల్లో కూడా యాజమాన్యం స్వయంగా రైతులకు పరిహారం అందించడం విశేషంగా నిలిచింది. రాష్ట్రంలో ఇంతవరకు కోల్డ్‌స్టోరేజ్ అగ్నిప్రమాదంలో రైతులకు నష్టపరిహారం అందించిన మొదటి ఘటనగా ఇది చరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, “రైతుల వెన్నంటే నిలబడ్డ నిజమైన ప్రజా ప్రతినిధి” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.







