
అమృతలూరు: నవంబర్ 24 :-జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ స్పష్టం చేశారు. అమృతలూరు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం సేకరణ చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకం ధాన్యానికి రూ.2,369లను ప్రభుత్వం నిర్ణయించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్వింటాకు రూ.69 పెంపు లభించిందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
రైతులు ముందుగా ఆర్‌ఎస్‌కేలలో తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. 73373 59375 వాట్సాప్ నంబర్‌కు “హాయ్” అని పంపితే ఆటోమేటిక్‌గా స్లాట్ బుకింగ్ జరిగి, సంబంధిత సమాచారం రైతుల మొబైల్ ఫోన్లకు తెలుగులోనే అందుతుందని చెప్పారు. కేటాయించిన సమయానికి మాత్రమే రైతులు ధాన్యం కేంద్రాలకు రావాలని సూచించారు.ధాన్యం తడవకుండా ప్రతి రైతు తార్పాలిన్ షీట్లు సిద్ధంగా ఉంచుకోవాలని, 17 శాతం కంటే తక్కువ తేమతో ధాన్యం తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.జిల్లాలో మొత్తం 117 రైతు సేవా కేంద్రాల ద్వారా వరి సేకరణ జరుగుతోందని, మిల్లర్లు–రైతుల మధ్య ఆన్‌లైన్ అనుసంధానం వ్యవస్థను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు సిబ్బందికి మూడు విడతలుగా శిక్షణ ఇచ్చినట్టు వివరించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు వీధి దీపాల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగానే వెంటనే పంచాయతీ కార్యదర్శిని దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో ఎన్. రామలక్ష్మి, పౌర సరఫరాల శాఖ డీఎం శివపార్వతి, తహశీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీతో పాటు వ్యవసాయ మరియు పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.







