
Krishna:పెడన, అక్టోబర్ 22:-పెడన నియోజకవర్గంలోని రైతులు తమ సమస్యలను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారికి వివరించారు. బంటుమిల్లి ప్రధాన కాలువ పరిధిలోని పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో విస్తరించిన సాగు భూములు ఎక్కువగా చౌడు భూములే కావడంతో, ఈ భూముల్లో వరి పంట తప్ప ఇతర పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు తెలిపారు.రైతుల ఆవేదన ప్రకారం, గత ఐదేళ్లుగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రెండో పంట దాళ్వా కోసం సాగునీరు విడుదల చేయకపోవడంతో భూములు నిరుపయోగంగా మారాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలోనూ నాలుగేళ్ల పాటు రెండో పంట సాగుకు నీరు ఇవ్వకపోవడంతో, భూముల సారం తగ్గి దిగుబడులు పడిపోయాయని రైతులు వాపోయారు.
దీంతో కౌలు రైతులు నష్టపోతున్నారని, కౌలు బస్తాలు కూడా తగ్గిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పంట లేకపోవడంతో వేలాది ఎకరాల సాగు భూములు చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయని రైతులు తెలిపారు.ప్రస్తుతం నీరు సమృద్ధిగా లభిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం రెండో పంట దాళ్వాకు సాగునీరు విడుదల చేయాలని రైతులు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారిని కోరారు. రైతుల అభ్యర్థనను ఎమ్మెల్యే శ్రద్ధగా విన్నారు.ఈ సందర్భంగా రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







