
అమరావతి: జనవరి 2:-రాష్ట్రంలో రీసర్వే పూర్తైన గ్రామాల్లో ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేపడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాస్‌పుస్తకాల పంపిణీ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి భూసేకరణ, పెండింగ్ రైల్వే కేసులు, డాక్యుమెంట్ అప్‌లోడ్ ఏజెంట్లు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై సీఎస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పాత పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలం పాటు ప్రతినెలా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, భూమి ఉన్న ప్రతి రైతుకూ కొత్త పాస్‌పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కూడా జిల్లాల్లో జరిగే పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
అనంతరం రైల్వే లెవెల్ క్రాసింగ్స్ తొలగించి వాటి స్థానంలో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా దశలవారీగా అన్ని లెవెల్ క్రాసింగ్స్ తొలగిస్తామని పేర్కొన్నారు.
వీడియో సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వే పూర్తయిన గ్రామాల కోసం ఇప్పటికే 23 లక్షల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ముద్రించి పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. పాత పాస్‌పుస్తకాలను తీసుకుని కొత్తవి ఇవ్వాలని, పాతవి చెల్లుబాటు కాకుండా చేసే విధానంపై త్వరలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, జేసీలకు పూర్తి బాధ్యత అప్పగించాలని సూచించారు. నీటి పన్ను వసూళ్లలో బలవంతం చేయకుండా రైతులను ఒప్పించి వసూలు చేయాలన్నారు.Amaravathi news
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే లెవెల్ క్రాసింగ్స్ తొలగించి ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 766 లెవెల్ క్రాసింగ్స్ ఉండగా, వాటిలో ఇప్పటికే 363 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు మంజూరయ్యాయని, మరో 403 మంజూరు కావాల్సి ఉందని తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి కె. భాస్కర్, ఆర్టీజిఎస్ సీఈవో ప్రఖర్ జైన్, ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాధన్‌తో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు, రైల్వే ఇంజనీర్లు పాల్గొన్నారు.










