
అమరావతి: 28 నవంబర్ 2025:-రాజధాని అమరావతి విస్తరణ కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తుళ్లూరు మండలంలోని ఏడు గ్రామాల్లో మొత్తం 16,666.56 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా పొందేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు.మంత్రి నారాయణ వివరించిన ప్రకారం, రాజధాని పరిసరాల్లో రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశారు. అమరావతి అభివృద్ధికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కీలకమని, అందుకోసమే 500 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపడతామని తెలిపారు.ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా పొందనున్నారు.వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో 7,562 ఎకరాలు,వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిం గ్రామాల్లో 9,104.57 ఎకరాలు పూలింగ్‌కు గురికానున్నాయి.అదనంగా ప్రభుత్వానికి ఇప్పటికే 3,828 ఎకరాల భూమి ఉన్నట్లు మంత్రి తెలిపారు.గతంలో అమల్లో ఉన్నట్లే రైతులకు అదే ప్యాకేజీ వర్తిస్తుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.జరీబు భూములకు 1000 చ.గ. నివాస ప్లాటు + 450 చ.గ. వాణిజ్య ప్లాటు,మెట్ట భూములకు 1000 చ.గ. నివాస ప్లాటు + 250 చ.గ. వాణిజ్య ప్లాటు కేటాయిస్తారు.కౌలు చెల్లింపులు కూడా పూర్వంలాగే కొనసాగుతాయని చెప్పారు.
స్పోర్ట్స్ సిటీ విషయంలో గతంలో కేవలం 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించాలంటే కనీసం 2,500 ఎకరాలు అవసరమని, అందుకోసమే విస్తరణ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో ఎకానమిక్ గ్రోత్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు జరీబు–నాన్ జరీబు భూములు, రోడ్డు శూలాలు, గ్రామ కంఠాల భూముల వంటి సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గ్రామ కంఠాల విషయంలో పొరపాటున ఎవరికైనా అదనంగా ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందన్నారు. అసైన్‌డ్ భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తోందన్నారు.రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే గ్రామ సభల నుంచి వచ్చిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించినట్టు వెల్లడించారు.







