
Hyderabad:26-11-25:-రాజ్యాంగాన్ని కాపాడుకుందాం… మనువాదాన్ని తిప్పికొడదాం” అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ పిలుపునిచ్చారు.77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… రాజ్యాంగం ఒక పుస్తకం మాత్రమే కాదని, ఈ దేశంలోని సబ్బండ వర్గాలు, అన్ని కులాలు–మతాల ప్రాణమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై మండిపడిన శ్రీకృష్ణ… అగ్రకులాల మహిళలకు 2489, ఎస్టీ మహిళలకు 1464, బీసీలకు 968, ఎస్సీలకు కేవలం 928 సర్పంచ్ స్థానాలు కేటాయించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచాలని రోడ్డెక్కి పోరాడాల్సిన స్థితి రావడం మరింత విచారకరమన్నారు.సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల పరిధిలో వర్గీకరణకు మాత్రమే సూచించిందని, అయితే తెలంగాణ ప్రభుత్వం మాలలను ప్రాథమిక విద్య నుంచే దూరం చేసే చర్యలు తీసుకోవడం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రోస్టర్ పాయింట్ల పేరిట మాలల కుటుంబాలపై అన్యాయ అనర్ధాలు మోపారని, ఓపెన్ కేటగిరీలో అలాంటి రోస్టర్లు లేవని అన్నారు.రాజ్యాంగాన్ని తప్పు దారి పట్టించిన జాతీయ పార్టీలకు మాలలు తమ ఓట్లతో గుణపాఠం చెప్పాలంటూ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్. గిరిజాశంకర్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సంకి ప్రసాద్, హైదరాబాద్ ఉపాధ్యక్షులు వినయ్, అర్జున్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.







