
గుంటూరు, అక్టోబర్ 16:-రజక వృత్తిదారుల రాజకీయ చైతన్య తరగతులు విజయవంతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. 1, 2 నవంబర్ 2025 తేదీల్లో నెల్లూరు జక్కా వెంకయ్య భవనంలో ఈ తరగతులు నిర్వహించనున్నాయి.ఈ మేరకు గుంటూరు పాతబస్తీలోని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద మండూరు వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో చైతన్య తరగతుల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన ప్రణాళికలో రజకుల కోసం ప్రకటించిన హామీల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“రజక వృత్తిదారుల కోసం సామాజిక రక్షణ చట్టం వెంటనే అమలులోకి తేవాలి. అలాగే రజక అభివృద్ధి-సంక్షేమ కార్పొరేషన్ ద్వారా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రజకుల అభివృద్ధికే వినియోగించాలి. ఆదరణ-3 పథకం ద్వారా ఆధునిక వృత్తి పరికరాలను సరఫరా చేయాలి. 50 సంవత్సరాలు నిండిన రజక వృత్తిదారులకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలి,” అని ఆయన పేర్కొన్నారు.అలాగే పట్టణాల్లో అపార్టుమెంట్లలో వాచ్మెన్ కమ్ ఇస్త్రీదారులుగా పని చేస్తున్న రజక వృత్తిదారులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, మహిళలపై అఘాయిత్యాలు ఆందోళనకరం అన్నారు. వీటన్నిటికీ నివారణగా ప్రభుత్వం హామీ ఇచ్చిన సామాజిక రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో దోబీ పోస్టులు భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టులు రజకేతరుల చేతుల్లోకి వెళ్లి శ్రమ దోపిడీ జరగడం వంటి అంశాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికి, రజక వర్గాలను సంఘటితంగా చైతన్యవంతం చేయడానికి రాజకీయ చైతన్య తరగతులు ఒక గొప్ప వేదికగానిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వెంపాటి చిన్న కొండయ్య (సీతయ్య), ఫణిదపు కోటేశ్వరరావు, బెండమూరి లంక కైలాసం, అద్దంకి సాంబశివరావు, సత్తెనపల్లి శ్రీనివాసరావు, లంక సుబ్రహ్మణ్యం, దిడ్డల వెంకటేశ్వరరావు, లంక శ్రీను, ధరణికోట వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.– బొజ్జ సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం







