
బాపట్ల మండలం జిళ్ళెళ్ళమూడి గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన అనంతరం, అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ఈరోజు రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ :
రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతుకు తన భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిక ముద్రతో కూడిన ఈ పాస్ పుస్తకాలు అత్యంత ప్రామాణికమైనవని, వీటి ద్వారా రైతులకు బ్యాంక్ రుణాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందడం సులభతరమవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
గతంలో భూ రికార్డుల విషయంలో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ-సర్వేను పూర్తి చేసిందని ఆయన తెలిపారు. రాజముద్రతో కూడిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు పూర్తిస్థాయి భద్రతను ఇస్తాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరిగిన ఈ సర్వే వల్ల సరిహద్దు వివాదాలకు తావుండదని, రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే తమ సంకల్పమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెవెన్యూ యంత్రాంగం నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి, క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

దశాబ్దాల కాలంగా తమ భూములకు సంబంధించి ఎదురుచూస్తున్న స్పష్టత ఇప్పుడు లభించిందని జిళ్ళెళ్ళమూడి గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి స్వయంగా వచ్చి పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యేకి వారు కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ గ్లోరియా , తాసిల్దార్ సలీమా, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గండికోట పోతురాజు, ప్రధాన కార్యదర్శి ఖగ్గా నాగరాజు, స్థానిక రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.bapatla news







