
వినుకొండ: జనవరి 18:-తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండలోని గంగినేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన “లెజెండ్రీ వైద్య రక్తదాన శిబిరాన్ని” పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, రక్తదానం అనేది అత్యంత గొప్ప సేవ అని, ఇది నేరుగా ప్రాణాలను కాపాడే మహత్తర కార్యమని అన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తం అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారుతుందని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.Guntur Local News :సారస్‌లో ఆహార పదార్థాల ఘుమఘుమలు
ఈ రక్తదాన శిబిరంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. కార్యక్రమం అంతటా సేవాభావం, ఉత్సాహం కనిపించాయి.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, వైద్య బృందం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.










