
Hyderabad:20-11-25:-రాష్ట్ర ఖజానాపై భారంగా మారుతోన్న రామ్‌కీ సంస్థతో ఉన్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ విషయం మీద యూనియన్ అధ్యక్షుడు గోపాల్ తీవ్రంగా స్పందించారు.హైదరాబాద్ లిబర్టీ వద్ద ఉన్న జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోపాల్ మాట్లాడారు.ఒక టన్ను చెత్తను తరలించడానికి జీహెచ్ఎంసికు రామ్‌కీ ₹2,800 వసూలు చేస్తోందని, అదే పనిని జీహెచ్ఎంసి సిబ్బంది చేస్తే కేవలం ₹350 ఖర్చు అవుతుందని వివరించారు.

ఈ విధంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా—అధిక మొత్తంలో చార్జీలు తీసుకుంటూ, కార్మికులకు సరైన వేతనాలు చెల్లించకపోగా, వారిపై వేధింపులు కూడా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రామ్‌కీ కాంట్రాక్టును ఇతర రాష్ట్రాలలో రద్దు చేసిన ఉదాహరణలు ఉన్నాయని గోపాల్ గుర్తుచేశారు.జీహెచ్ఎంసి అధికారులను ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడుతున్న రామ్‌కీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, కాంట్రాక్టును రద్దు చేయాలని, చెత్త తరలింపు పనులను జీహెచ్ఎంసి కార్మికుల ద్వారానే నిర్వహించాలని యూనియన్ డిమాండ్ చేసింది.







