ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో 60 ఏళ్ల మహిళకు గంటలోనే పక్షవాతం నుంచి బయటపడేలా వైద్యులు అద్భుతం చేశారు. పెదరవేగికి చెందిన వెంకటేశ్వరమ్మకు ఈ నెల 12న ఉదయం 8 గంటల సమయంలో కుడి చేయి, కుడి కాలు ఒక్కసారిగా బిగిసిపోగా, కుటుంబసభ్యులు వెంటనే స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ విద్యాసాగర్ పర్యవేక్షణలో ఉన్న వైద్య బృందం తక్షణమే పరిశీలించి, పక్షవాతం లక్షణాలు బయటపడిన నాలుగు గంటల లోపు థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇస్తే కోలుకునే అవకాశం ఉందని నిర్ధారించారు.
దాదాపు రూ.30-40 వేల విలువైన ఈ ఇంజెక్షన్‌ను వెంటనే సమీకరించి, ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలో అత్యవసర చికిత్స ప్రారంభించారు. గంటలోపే వెంకటేశ్వరమ్మకు కాళ్లు, చేతులు కదలడం ప్రారంభమయ్యింది. ఉదయం స్ట్రెచర్‌పై వచ్చిన ఆమె సాయంత్రానికి బెడ్ నుంచి లేచి తిరగడం ప్రారంభించడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగుల కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.
గతంలో ఈ తరహా పక్షవాత కేసుల కోసం గుంటూరు, విజయవాడ, కాకినాడలకు రోగులను పంపించాల్సి వస్తుండగా, ఇప్పుడు ఏలూరు బోధనాసుపత్రిలోనే న్యూరో సర్జన్ డాక్టర్ విద్యాసాగర్ నేతృత్వంలో స్ట్రోకు రోగులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని స్థానికులు వినియోగించుకోవాలని ఆసుపత్రి వర్గాలు సూచించాయి. పక్షవాతం వచ్చిన తర్వాత తొలిగంటలు కీలకమని, సమయపూర్వక వైద్యంతో ప్రాణాలను రక్షించడమే కాకుండా శరీర భాగాల ఫంక్షన్‌ను కూడా తిరిగి సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.