
నాయుడుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ సోమవారం 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. తొలుత ముక్కర అంబికా అనే లబ్ధిదారుని ఇంటికి చేరుకున్న సీఎం, ఆ కుటుంబ సభ్యులు నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి నివాసానికి వెళ్లి, వారి సంప్రదాయం ప్రకారం జరిగిన ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా రెండు కుటుంబాల సభ్యులకు ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు బహుకరించి, టిడ్కో గృహ స్వాధీన పత్రాలను అందజేశారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే తమ ఇంటి గృహప్రవేశానికి రావడంతో ఆ కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు పార్థసారధి, నారాయణ, అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఈ మలి విడత ఇళ్ల పంపిణీ ద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.http://THIRUPATHI NEWS







