ఏలూరు, సెప్టెంబర్ 20:రాష్ట్రంలోని దస్తావేజు లేఖరులు చేపట్టిన నిరసన కార్యక్రమం రెండవ రోజుకీ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖరులు భారీగా సమావేశమై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం రిజిస్టర్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. ఇది నిరసన కార్యక్రమం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనడానికి నిదర్శనం” అని తెలిపారు.
అలాగే, ప్రజల నుంచి కూడా మంచి మద్దతు లభించిందని, కక్షిదారులు సహృదయంతో స్పందించారని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిరసన చేస్తున్నామని స్పష్టం చేశారు.
“ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోతే, ఈ నెల 22వ తేదీ నుంచి నిరసనలను మరింత ఉధృతం చేస్తాం” అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎల్.వి.ఎస్. రమణ, గారపాటి వీరస్వామి, దాసరి సుబ్బారావు, సముద్రాల కృష్ణమోహన్ సహా పలువురు దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.