
అమరావతి: 30-10-25:-భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. వచ్చే నెల 8న ఈ వేడుకలను అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో రాష్ట్ర స్థాయిలో ఘనంగా జరపనున్నట్లు ఆమె గురువారం వెల్లడించారు.భక్త కనకదాస స్వరకర్తగా, సామాజిక తత్వవేత్తగా సమాజంలో అసమానతలపై పోరాడారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆయన కీర్తనలు, రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారని, సామాజిక రుగ్మతల నిర్మూలనలో విశేష సేవలు చేశారని కొనియాడారు. అటువంటి మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందకరమని ఆమె పేర్కొన్నారు.

గత ఏడాది అనంతపురంలో రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతి నిర్వహించిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి సవిత, ఈసారి కల్యాణదుర్గం వేదికగా వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఉత్సవాలకు మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారని చెప్పారు.జయంతి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు రెండ్రోజుల్లో విడుదల కానున్నాయని మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతిని ఘనంగా జరపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొననున్నట్లు తెలిపారు.







