
విజయవాడ: నవంబర్ 09:-రాష్ట్రాన్ని గుంతల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందని రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ ఇఎన్‌సీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రూ. 1,081 కోట్ల నిధులతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. దీనివల్ల ప్రజల్లో ఆర్‌అండ్‌బీ శాఖపై విశ్వాసం పెరిగింది” అని అన్నారు.తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రహదారులు దెబ్బతిన్నప్పటికీ వాటి పునరుద్ధరణకు ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు. “ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు రూ. 2,500 కోట్లతో పనులు చేపట్టాం. మరో వెయ్యి కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు పిలిచాం” అని తెలిపారు.

ప్రజలపై భారం పడకుండా రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) మోడల్ పై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా రోడ్ల సమస్యలను ఏపీఆర్‌డీసీ సభ్యులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. “ఆర్థిక వనరులను సమన్వయ పరుచుకుంటూ, ఎన్‌డీబీ, నాబార్డ్ వంటి సంస్థల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి చేస్తున్నాం” అని చెప్పారుఈ సందర్భంగా ఏపీఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, నూతన సభ్యులు తమ పరిధిలోని రహదారుల సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. “రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి” అని ఆయన సభ్యులను ఆహ్వానించారు.తరువాత 16 మంది కొత్త సభ్యులు మంత్రిసమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్యులు వారిని అభినందిస్తూ శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఆర్‌డీసీ ఎండి ఎల్. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







