
హైదరాబాద్:-పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

హిమాయత్ నగర్ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ, నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్ల నిధులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులతో నగర మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజ్, తాగునీటి వంటి కీలక రంగాల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.

నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మూడు కార్పొరేషన్లుగా విస్తరించారని తెలిపారు. కొత్త కార్పొరేషన్లకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించినట్లు పేర్కొన్నారు. అవసరమైతే మరింత బడ్జెట్ కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ అభివృద్ధి చెందితేనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెరుగుతాయని, దాంతో యువతకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని దానం నాగేందర్ అన్నారు. నగరాన్ని పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.Hyderabad local news










