
అమరావతి, అక్టోబర్ 6:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పెండింగ్ నిధులు రూ.34 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సోమవారం విజయవాడలోని వివంత హోటల్ లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేను ఆయన కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించామని మంత్రి డా. స్వామి వెల్లడించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల కోసం విజ్ఞప్తి చేశామని తెలిపారు.
అలాగే, అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద విద్యార్థులకు కేంద్రం 50 శాతం సబ్సిడీ నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించిందని వివరించారు.
అట్రాసిటీ నిధులు త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, అన్ని అంశాల్లోనూ సానుకూలంగా స్పందించారని డా. స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అన్ని విధాల సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.







