లేబర్ కోడ్‌ల రద్దు డిమాండ్ చేస్తూ ఫిరంగిపురంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ
కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది. అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్మికులు , వివిధ శాఖల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, “లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి”, “కార్మికుల హక్కులను కాపాడండి” వంటి నినాదాలతో పంచాయతీ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ, “నూతన లేబర్ కోడ్‌లు కార్మికుల భవిష్యత్తుకు ప్రమాదకరం. కనీస వేతనం హక్కును కూడా వీటి ద్వారా హరిస్తున్నారు” అని ఆరోపించారు.
సిఐటియు మండల కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలపై ప్రజలు, కార్మికులు గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.