
గుంటూరు, నవంబర్ 1 :-రైతుల పక్షపాతిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) వ్యవహరించాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు.పత్తి కొనుగోలు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులుతో కలిసి సంబంధిత అధికారులతో మంత్రి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – రైతుల వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సి.సి.ఐ పనిచేయాలని సూచించారు. పత్తి ఆరవేసుకునే సదుపాయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ, ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించానని తెలిపారు. తుఫాన్ కారణంగా ఉద్యాన, వ్యవసాయ, పత్తి పంటలు తీవ్ర నష్టం చవిచూశాయని చెప్పారు.అరటి, పసుపు పంటలకు హెక్టారుకు సుమారు రూ.35 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించారు.సుమారు 2,500 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, మొత్తం 89 వేల హెక్టార్లలో పంటలు వరదలకు గురయ్యాయని తెలిపారు. శుక్రవారం నాటికి 2,500 హెక్టార్లు నీటమునిగివుండగా, శనివారం నాటికి 1,500 హెక్టార్లకు తగ్గిందని చెప్పారు.రైతులకు అన్యాయం జరగకుండా త్వరితగతిన పంట నష్టం అంచనాలు సిద్ధం చేయిస్తున్నామని, పత్తి, మిరప, కూరగాయల వంటి అన్ని పంటలను పరిగణనలోకి తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కౌలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.పత్తికి రూ. 8,110 మద్దతు ధర ప్రకటించామని, కొనుగోలు ప్రక్రియలో ఏర్పడుతున్న సాంకేతిక అవరోధాలు తొలగించేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు వివరించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజా వలి, సి.సి.ఐ జనరల్ మేనేజర్ రాజేంద్ర షా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.







