
విజయవాడ: నవంబర్ 29:-రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతోనే రెండో దశ భూ సమీకరణ చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రజల రాజధానిని మరింత విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.
అమరావతి పరిధిలోని ఏడు గ్రామాల్లో 16,666 ఎకరాలను రైతుల సమ్మతితో, మొదటి విడత మోడల్‌లోనే సమీకరిస్తున్నట్లు వివరించారు. రాజధాని అంశంపై వైసీపీ మరియు ఆ పార్టీకి చెందిన జె.మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. *“గత అయిదేళ్లలో అమరావతికి పట్టెడు మెతుకులు పెట్టని వారికి ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడే అర్హత లేద”*ని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాటిన మొక్కలను వైఎస్ జగన్ ప్రభుత్వం పీకేసిందని, వేసిన రోడ్లను త్రవ్వి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరు చెబితే వైసీపీకి గిట్టదని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.రాజధాని ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని బాలకోటయ్య తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. మొదటి విడత గానీ, రెండో విడత గానీ రాజధాని కోసం భూమి ఇచ్చిన ఏ రైతుకూ నష్టం జరగదని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు గంథం సంపత్ కుమార్, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు, అమరావతి రైతు నాయకులు కుమ్మరి కోటేశ్వరరావు, అమరావతి బహుజన ఐకాస నాయకులు మామిడి సత్యం, వజ్రాల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.







