
రేపల్లె టౌన్:25-11-25:- రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లను ఖండిస్తూ, రేపల్లె డిపో వద్ద SWF నాయకత్వంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఏలూరు డిపోకు చెందిన పెట్రోల్ బంకులో జరిగిన అవకతవకల అంశంలో నిజమైన దోషులను వదిలేసి, సంబంధం లేని సిబ్బందిని న్యాయప్రమాణాలకు విరుద్ధంగా సస్పెండ్ చేసిన చర్యలను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు.రేపల్లె ఆర్టీసీ గ్యారేజ్ ముందు జరిగిన ఈ ధర్నాలో మాట్లాడుతూ, SWF రేపల్లె డిపో కమిటీ కార్యదర్శి ఎన్వీ సాగర్ తెలిపారు:
“రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా యాజమాన్యం విచక్షణారహితంగా సస్పెన్షన్లు విధిస్తోంది. ఏలూరు డిపోలో జరిగిన ఈ అక్రమ సస్పెన్షన్‌లో, ఉద్యోగుల సమస్యలను ప్రతిరోజూ ప్రశ్నించే SWF రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్యపై కక్షసాధింపు చర్యలు తీసుకున్నారు. డిపిటిఓ–విజయవాడ జోన్ అధికారులు న్యాయ నియమాలను పూర్తిగా పట్టించుకోకుండానే విధులను నిలిపివేశారు” అని ఆయన ఆరోపించారు.
ఇటీవలి కాలంలో ఆర్టీసీ స్త్రీశక్తి కార్యక్రమం తరువాత కూడా అనేక చోట్ల సిబ్బందిపై దాడులు జరిగాయని, అయినప్పటికీ యాజమాన్యం పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేసి, నిర్దోషులైన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని SWF రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అదనంగా, ఆర్టీసీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిపో నాయకులు శివప్రసాద్, సురేష్, రాజబాబు, నాగరాజు, దేవరాజు, సుబ్బారావు, సాంసన్, భాస్కరరావు, రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.







