
Guntur:మంగళగిరి: అక్టోబర్ 19 :-ఆంధ్రప్రదేశ్ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులు శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.జర్నలిస్టుగా కనీసం 20 సంవత్సరాల అనుభవం కలిగి, 58 సంవత్సరాలు పూర్తి చేసినవారు రాష్ట్రంలో 500 మందికి మించి ఉండరని, కాబట్టి ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని వారు తెలిపారు. దేశంలోని 19 రాష్ట్రాలలో ఇప్పటికే ఈ పథకం అమలులో ఉందని చెప్పారు.
ఇతర రాష్ట్రాలలో జర్నలిస్టులకు ఇస్తున్న పెన్షన్ వివరాలు, సంబంధిత జీవోలు తదితర వివరాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి, విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రిని కలిసిన వారిలో యూనియన్ గౌరవాధ్యక్షులు శిరందాసు నాగార్జునరావు, జనరల్ సెక్రటరీ జి. చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి. రామారావు, ట్రెజరర్ ఎం.పీ. రామారావు తదితరులు ఉన్నారు.







