“ప్రకృతిని కాపాడితేనే.. ప్రకృతి మనల్ని కాపాడుతుంది,” అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. “వనమే మనం, మనమే వనం” అని పెద్దలు చెప్పినట్లే, ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని, వాటిని పిల్లల్లా సంరక్షించాలని సీఎం సూచించారు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవం – 2025లో ముఖ్యమంత్రి రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, వేమ నరేందర్ రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ, ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అటవీ శాఖ – HMDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.
18 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం గా పెట్టుకున్నామని, ప్రతి అమ్మ, ప్రతి పిల్ల కూడా ఒక మొక్కను నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును సీఎం రేవంత్ గుర్తుచేశారు. మొత్తం రాష్ట్రంలో పచ్చదనం విస్తరించడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని చెప్పారు.
🌱 మహిళా శక్తి పై ఫోకస్ 🌱
సీఎం మాట్లాడుతూ, “మహిళల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తోంది,” అని తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళలకు అప్పగించామని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా 1000 బస్సులను అద్దెకు ఇచ్చి మహిళలను బస్సు యజమానులుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
హైటెక్ సిటీ వంటి చోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువుల మార్కెటింగ్ సదుపాయాలు కల్పించామని, తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని, మిస్ వరల్డ్ పోటీదారులు కూడా మహిళా సంఘాల వస్తువులను చూసి ప్రశంసించారని వివరించారు.
“కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యం,” అని సీఎం రేవంత్ స్పష్టంగా తెలిపారు. రాష్ట్రంలో 1000 బస్సులకు మహిళలు యజమానులు అయ్యారని, మహిళా శక్తి భవన్ నిర్మించామని గుర్తుచేశారు.
మహిళా రిజర్వేషన్ పై కీలక ప్రకటన
సీఎం మాట్లాడుతూ, “స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే,” అని గుర్తుచేస్తూ త్వరలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. 51 అసెంబ్లీ సీట్లు మహిళలకు రిజర్వ్ చేసి, మరో 10 సీట్లు అదనంగా కేటాయిస్తామన్నారు.
🌿 ప్రకృతిని కాపాడటమే, మహిళా శక్తిని ఎదగనివ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని సీఎం రేవంత్ తెలిపారు.
✈️ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
సీఎం రేవంత్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్నారు. రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తారు. కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మాండవీయతో మధ్యాహ్నం 2:30కి సమావేశమవుతారు. తెలంగాణకు సంబంధిత అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి, రాష్ట్రానికి యూరియా కోటా పెంచమని కోరనున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ అనుమతులపై చర్చిస్తారు. విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి పెండింగ్ నిధుల విడుదలపై కేంద్ర మంత్రులను కలవనున్నారు.
42% రిజర్వేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో నిధుల కేటాయింపులు, కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రతిపాదనలు వినిపించనున్నారు.