
మచిలీపట్నం: డిసెంబరు 30, 2025:–జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా సమర్థవంతంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

మంగళవారం సాయంత్రం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, పాత పత్రాల డిజిటలైజేషన్, రెవెన్యూ క్లినిక్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం వివరాలను కలెక్టర్ వివరించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, సలహా సూచనలు, 22-ఏ అంశాలు, భూసేకరణ సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, సుమోటో అడంగల్ కరెక్షన్, రీ సర్వే, విస్తీర్ణం తేడాలు, జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ (ఎల్పిఎం) తదితర రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కౌంటర్ల ద్వారా అందిన పలు అర్జీలను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజల రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందిస్తామని సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ తెలియజేశారు.Nara Lokesh to visit Machilipatnam today
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










