రోజా ఖబర్దార్ జనసేన మహిళల హెచ్చరిక||Roja Khabardaar Warning from JanaSena Women
రోజా ఖబర్దార్ జనసేన మహిళల హెచ్చరిక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీకి చెందిన మహిళా నాయకులు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకో, రోజా… ఖబర్దార్!’’ అంటూ గట్టిగానే హెచ్చరించారు.
ఏలూరు జిల్లా జనసేన వీరమహిళా కార్యదర్శి తేజస్విని, నగర జనసేన 1వ పట్టణ కార్యదర్శి ప్రమీల లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రోజా మాట్లాడిన వ్యాఖ్యలు బాధాకరమైనవే కాకుండా, బాధిత మహిళల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న భావాన్ని కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన మహిళలపై దాడులు, అక్రమ చర్యలు, అమానుష ఘటనలు ప్రజలందరికీ గుర్తున్నాయని వారు తెలిపారు. అప్పుడు మంత్రి పదవిలో ఉన్న రోజా ఆ హింసా ఘటనలపై ఒక్క మాటైనా మాట్లాడిందా? ఆ సమయంలో బాధితుల తరపున నిలబడిందా? అనే ప్రశ్నలు విసిరారు.
‘‘ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం మీద మీరు చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా రోజా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విమర్శించిన మాటలు మరిచారా? ఇప్పుడు మీడియా ముందు రోదిస్తూ అనవసర ఆరోపణలు చేయడం సరికాదు. మీ బాష, ప్రవర్తన మార్చుకోండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గౌరవించడం లేదు, గణించడంలేదు’’ అంటూ తేజస్విని అన్నారు.
జనసేన నాయకులు రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నారని, ప్రతి ఒక్క మహిళకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. మహిళలు రాజకీయాల్లో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరచగలగాలంటే రాజకీయ నేతలు తమ మాటల్లో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సూచించారు.
‘‘ముందు మీరు మహిళల హక్కుల కోసం మాట్లాడటానికి అర్హత సంపాదించండి. మహిళల బాధను మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. మేము ఏదైనా మౌనంగా చూస్తూ కూర్చొమని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. రోజా… ఇంకొకసారి ఇలాగే మాట్లాడితే తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్!’’ అంటూ వారిది స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఇతర జనసేన మహిళా నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని, వైసీపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయాన్ని ఇలా వ్యక్తిగత విమర్శలతో మలచడం తగదు అని అన్నారు.