హైదరాబాద్, సెప్టెంబర్ 21:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్దోత్సవాల సందర్భంగా, ఆదివారం సాయంత్రం సీతారాం బాగ్‌లోని శ్రీ జగన్నాథ మఠంలో ఘనంగా ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ లింగం శ్రీధర్ జీ పాల్గొని, సంఘ సిద్ధాంతాల ప్రాధాన్యతను వివరించారు.
“శక్తి లేని వ్యక్తి శవంతో సమానం,” అని స్పష్టం చేసిన ఆయన, “శక్తితో పాటు సంస్కారం, సమర్పణ, సేవాభావం కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలి,” అని పిలుపునిచ్చారు.
వెయ్యి ప్రాంతాల్లో శతాబ్దోత్సవాలు – దసరా నాటికి లక్ష్యంగా
లింగం శ్రీధర్ జీ ప్రకటన మేరకు, జంట నగరాల్లోని వెయ్యికి పైగా ప్రాంతాల్లో ఈ శతాబ్దోత్సవాలను నిర్వహించేందుకు సంఘం కార్యాచరణ సిద్ధం చేసింది. “గడపలోపల కులం, గడప దాటితే మేమంతా హిందువులం” అంటూ సామాజిక సమైక్యతకు ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణపై మాట్లాడిన ఆయన, ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
“100 ఏళ్ల సేవా యాత్ర” – డా. లక్ష్మీనారాయణ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా. అనుపురం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “గత 100 సంవత్సరాలుగా ఆరెస్సెస్ దేశానికి అనేక రంగాల్లో విశేష సేవలు అందించింది,” అని పేర్కొన్నారు.
ధర్మరక్షణకు ప్రతిజ్ఞ – జగన్నాథ మఠాధిపతి
శ్రీ జగన్నాథ మఠ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అచ్యుత రామానుజాచార్య స్వామీజీ మాట్లాడుతూ, “మానవజీవితం సంపూర్ణంగా మారాలంటే తల్లిదండ్రులను పూజిస్తూ, ధర్మరక్షణకు పాటుపడాలి,” అని అన్నారు. రాబోయే 15 సంవత్సరాలు దేశ భవిష్యత్తు దృష్ట్యా అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
సంప్రదాయాలతో కూడిన సందేశాల మధ్య, ఆరెస్సెస్ శతాబ్దోత్సవాల ప్రారంభం గంభీరంగా సాగింది.