
అమరావతి:– విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా వినియోగించేందుకు త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ మూడో భేటీ బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వర్చువల్‌గా పాల్గొన్నారు.

పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట తదితరులు ప్యాలెస్‌కు సంబంధించిన అంశాలను కమిటీకి వివరించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా వంటి సంస్థలు ముందుకొచ్చినట్లు మంత్రులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనాలు హోటళ్లకు పూర్తిగా అనుకూలంగా లేవని, అదనపు నిర్మాణాలపై ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు.
సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి లేదని, మిగిలిన 2 ఎకరాల వినియోగంపై చర్చించినట్లు మంత్రులు తెలిపారు. డిసెంబర్ 28న మరోసారి జీఓఎం భేటీ నిర్వహించి, తుది ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదానికి పంపనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలు అనుసరించే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిపారు.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రుషికొండ ప్యాలెస్‌ను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఆర్‌జెడ్ నిబంధనల మేరకు 7 ఎకరాల్లో నిర్మాణాలు సాధ్యం కాకపోవడంతో, మిగిలిన 2 ఎకరాల వినియోగంపై మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్యాలెస్‌లోని చివరి రెండు బ్లాక్‌లను ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. పర్యాటక శాఖ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించినట్లు వెల్లడించారుAmaravathi Local News.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఏటా రూ.7 కోట్ల ఆదాయం తెచ్చే రిసార్ట్స్ స్థానంలో ప్యాలెస్ నిర్మాణం వల్ల నెలకు రూ.25 లక్షల నిర్వహణ భారం పడుతోందన్నారు. అందుబాటులో ఉన్న భూమిలోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ప్రజలకు సందర్శనార్థం ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వయబుల్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించి, హాస్పిటాలిటీ వినియోగానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తుది నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.










